flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Wednesday, March 28, 2018

ధ్వజస్థంభం పుట్టుకమనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

Monday, February 26, 2018

HIMA SONGS

అలసట - ఆతిథ్యం


కర్ణాటకకు చెందిన ప్రముఖ వైద్యులు ఒకరు నాకు ఈ సంఘటనను చెప్పారు. వారు చాలా లబ్ధప్రతిష్టులు. పేదవారికి వారు చేసిన వైద్యసేవ అనన్యమైనది. ఒకసారి భార్యాపిల్లలతో కలిసి వారు ఒక రహదారి మీదుగా వెళ్తున్నారు. హఠాత్తుగా కుండపోతగా వర్షం మొదలై మొత్తం చీకటి అయిపోయింది. దారి కూడా సరిగ్గా కనపడడం లేదు. మెల్లిగా వాహనం నడుపుతూ దాదాపు రాత్రి పదకొండు గంటలప్పుడు ఒక చిన్న ఊరు చేరుకున్నారు.
దారిపక్కన ఉన్న ఒక ఇంటిలో పెద్ద వెలుగు ఉండడం గమనించారు. దారి పక్కనే కొంతమంది నిలబడి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. ఆ రాత్రి బస చేయడానికి దగ్గర్లో ఎక్కడైనా మంచి హోటలు ఉందేమో అని కనుక్కోవడానికి కారు ఆపి బయటకు దిగారు. వారిలో ఒకరు మీరు డాక్టరా? కుటుంబంతో కలిసి వచ్చారా? అని వివరాలు అడిగారు. డాక్టరు గారు అవునని చెప్పారు. దాదాపు రెండుగంటల నుండి వారికోసమే వేచియున్నట్టు చెప్పారు ఆ గ్రామస్థులు.
వారు ఆ డాక్టరుతో “ఆహారం సిద్ధంగా ఉంది. లోపలికి వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి” అని చెప్పారు. అతను చాలా అశ్చర్యపోయి, వారులో ఎవరైనా తను వైద్యం చేసిన వారు తనని గుర్తిపట్టి ఉంటారేమో అని అడిగాడు. “మీరు ముందు వచ్చి ఆహారం తీసుకోండి. పిల్లలు, మీరు కొంచం విశ్రాంతి తీసుకోండి. తరువాత మీ ప్రశ్నలన్నీటికి సమాధానం చెప్తాము” అని చెప్పారు.
అరగంట తరువాత అందరూ భోజనం చేసి కూర్చున్నారు. అప్పుడు వారు అతనితో, “పరమాచార్య స్వామివారు తమ తదుపరి మకాంకు మా ఊరిగుండా వెళ్తారని మాకు ఈ రోజు ఉదయం తెలిసింది. మేము స్వామివారు మరియు మఠం పరివారం కోసం ఆహారాన్ని సిద్ధం చేశాము. వారు ఈ ఊరికి రాగానే కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్ళవల్సిందిగా ప్రార్థించాము.
కాని వారు వర్షం మొదలవ్వక ముందే తదుపరి మకాం చేరిపోవాలని చెప్పారు. మరలా పరమాచార్య స్వామివారు రాత్రికి ఒక డాక్టరు తన కుటుంబంతో సహా ఈ దారిలో వస్తారని వారు చాలా అలసిపోయి ఉంటారు కనుక వారికి భోజనము విశ్రాంతికి వసతి ఏర్పాటు చెయ్యాలని అనుజ్ఞ ఇచ్చారు. మీరు ఎప్పుడు వస్తారా అని రెండు గంటల నుండి ఎదురుచూస్తున్నాము” అని చెప్పారు.
ఈ డాక్టరు ఇదివరకెప్పుడు మహాస్వామిని చూడలేదు. ఈ సంఘటన తరువాత అతను కంచి శ్రీమఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాడు. తరువాత అతను స్వామివారికి పెద్ద భక్తుడయ్యాడు.
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై.
KanchiParamacharyaVaibhavam కంచిపరమాచార్యవైభవం సేకరణ: 

Wednesday, May 24, 2017

తెలుగుసొబగు

 రమాకుమారుడు : మన్మధుడు
 మాకుమారుడు   : మన్మధుడు
 కుమారుడు         : మన్మధుడు
 మారుడు            : మన్మధుడు 

Monday, May 8, 2017

## ధర్మో రక్షతి రక్షితః #

ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది. 
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."
ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు. 
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు. 
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.
...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...
## ధర్మో రక్షతి రక్షితః #

                                                                         

                                                                                                                   ✿ హిమజ ✿

Wednesday, February 8, 2017

రామాయణ చిత్రం

శ్రీ రామాయణం ఒకమహాకావ్యం.ఎంత ప్రాచీనమో,అంత నిత్య నూతనం.తండ్రి ఆజ్ఞను పాటించటం,అన్నదమ్ముల ఆప్యాయత,భార్యాభర్తల ప్రేమానురాగం ఇంకా మరెన్నో లక్షణాలు రామాయణం నుండి నేర్చుకోవచ్చు. 
అలాంటి రామాయణంలోని ఘట్టాలను ఒకే చిత్రంలో చిత్రీకరించారు .కర్నూలుజిల్లా,నంద్యాల చిత్రకారుడు శ్రీ కోటేష్ గారు.శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని 38 ప్రధాన ఘట్టాలను 9 గంటల్లో చిత్రీకరించి ప్రతిభను కనబరిచారు.  


Monday, January 23, 2017

⌘ తెలుగు భాషా చమత్కారాలు ⌘

 తెలుగు భాషా చమత్కారాలు
మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళారు "టిఫినేముంది?" అనడిగాడు. "దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.

మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.

ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని బదులిచ్చాడు శ్రీశ్రీ.

ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.

ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు.

ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక కంఠకుడు" అని సరి చేశాడు.

"జమాల్ భాషా - తోక - మాల్ భాషా ఇట్లనెను" అనేది తప్పు. జమాల్ భాషాతో కమాల్ భాషా ఇట్లనెను అనేది రైటు.

ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి సహకరించమని అడిగాడు. 
"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా" అన్నారు విశ్వనాధ వారు
"మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి" అనన్నాడా హరిదాసు. 
"మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే" అన్నారు విశ్వనాధ వారు.