flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, February 26, 2018

HIMA SONGS

అలసట - ఆతిథ్యం


కర్ణాటకకు చెందిన ప్రముఖ వైద్యులు ఒకరు నాకు ఈ సంఘటనను చెప్పారు. వారు చాలా లబ్ధప్రతిష్టులు. పేదవారికి వారు చేసిన వైద్యసేవ అనన్యమైనది. ఒకసారి భార్యాపిల్లలతో కలిసి వారు ఒక రహదారి మీదుగా వెళ్తున్నారు. హఠాత్తుగా కుండపోతగా వర్షం మొదలై మొత్తం చీకటి అయిపోయింది. దారి కూడా సరిగ్గా కనపడడం లేదు. మెల్లిగా వాహనం నడుపుతూ దాదాపు రాత్రి పదకొండు గంటలప్పుడు ఒక చిన్న ఊరు చేరుకున్నారు.
దారిపక్కన ఉన్న ఒక ఇంటిలో పెద్ద వెలుగు ఉండడం గమనించారు. దారి పక్కనే కొంతమంది నిలబడి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. ఆ రాత్రి బస చేయడానికి దగ్గర్లో ఎక్కడైనా మంచి హోటలు ఉందేమో అని కనుక్కోవడానికి కారు ఆపి బయటకు దిగారు. వారిలో ఒకరు మీరు డాక్టరా? కుటుంబంతో కలిసి వచ్చారా? అని వివరాలు అడిగారు. డాక్టరు గారు అవునని చెప్పారు. దాదాపు రెండుగంటల నుండి వారికోసమే వేచియున్నట్టు చెప్పారు ఆ గ్రామస్థులు.
వారు ఆ డాక్టరుతో “ఆహారం సిద్ధంగా ఉంది. లోపలికి వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి” అని చెప్పారు. అతను చాలా అశ్చర్యపోయి, వారులో ఎవరైనా తను వైద్యం చేసిన వారు తనని గుర్తిపట్టి ఉంటారేమో అని అడిగాడు. “మీరు ముందు వచ్చి ఆహారం తీసుకోండి. పిల్లలు, మీరు కొంచం విశ్రాంతి తీసుకోండి. తరువాత మీ ప్రశ్నలన్నీటికి సమాధానం చెప్తాము” అని చెప్పారు.
అరగంట తరువాత అందరూ భోజనం చేసి కూర్చున్నారు. అప్పుడు వారు అతనితో, “పరమాచార్య స్వామివారు తమ తదుపరి మకాంకు మా ఊరిగుండా వెళ్తారని మాకు ఈ రోజు ఉదయం తెలిసింది. మేము స్వామివారు మరియు మఠం పరివారం కోసం ఆహారాన్ని సిద్ధం చేశాము. వారు ఈ ఊరికి రాగానే కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్ళవల్సిందిగా ప్రార్థించాము.
కాని వారు వర్షం మొదలవ్వక ముందే తదుపరి మకాం చేరిపోవాలని చెప్పారు. మరలా పరమాచార్య స్వామివారు రాత్రికి ఒక డాక్టరు తన కుటుంబంతో సహా ఈ దారిలో వస్తారని వారు చాలా అలసిపోయి ఉంటారు కనుక వారికి భోజనము విశ్రాంతికి వసతి ఏర్పాటు చెయ్యాలని అనుజ్ఞ ఇచ్చారు. మీరు ఎప్పుడు వస్తారా అని రెండు గంటల నుండి ఎదురుచూస్తున్నాము” అని చెప్పారు.
ఈ డాక్టరు ఇదివరకెప్పుడు మహాస్వామిని చూడలేదు. ఈ సంఘటన తరువాత అతను కంచి శ్రీమఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాడు. తరువాత అతను స్వామివారికి పెద్ద భక్తుడయ్యాడు.
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై.
KanchiParamacharyaVaibhavam కంచిపరమాచార్యవైభవం సేకరణ: