flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Saturday, July 27, 2019

కంచి పరమాచ్యార్య కధలు

!!ప్రదక్షిణం !!

పరమాచార్య స్వామివారి దర్శనానికి ఊబకాయంతో బాధపడుతున్న మహిళ ఒకరు వచ్చారు. ఆమె మహాస్వామివారికి నమస్కారం కూడా చెయ్యలేకపోతోంది. భక్తితో చేతులు కట్టుకుని నిలబడి ఇబ్బందిగా చూస్తోంది.

“నాకు మధుమేహం ఉంది. వైద్యులు నేను బరువు తగ్గాలని తెలిపారు. అందుకు రోజూ ఒక గంట సేపు నడవాలని సూచించారు. కాని నేను సరిగ్గా పది నిముషాలు కూడా నడవలేను” అని స్వామివారికి విన్నవించుకుంది. “స్వామివారే నాకు ఏదైనా సులభమైన మార్గం చూపాలి” అని ప్రార్థించింది.

“ఈ వైద్యులందరూ ఇంతే, వైద్యశాస్త్ర పుస్తకాలలో వ్రాసినదాన్నే చెబుతూ ఉంటారు. దాని సాధ్యాసాధ్య విషయంపై ఏమాత్రం ఆలోచించరు” అని అన్నారు స్వామివారు.

స్వామివారు ఎదో సులువైన ఉపాయం చెప్పబోతున్నారని ఆ భక్తురాలి మొహం వెలిగిపోయింది. కళ్ళల్లో ఆశ కనబడుతోంది.

“ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆరోగ్యం బాగుండాలి అంటే, భగవంతుని అనుగ్రహం ఉండాలి . . .” ఏమి చెబుతారా అని ఆవిడ గుండె వేగం పెరిగింది.

“మీ ఇంటి దగ్గర ఏదైనా ఆలయం ఉందా?”

“ఉంది పెరియవా, పెద్ద శివాలయం ఒకటి ఉంది”

“మంచిది! ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఆరు ‘ప్రదక్షిణలు’ చెయ్యి. అలాగే రోజూ చీపురతో ఒక వంద అడుగుల స్థలాన్ని శుభ్రం చెయ్యి”.

ఆమె చాలా ఆనందపడి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న సహాయకుడు నవ్వును ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
స్వామివారు చూసి, “నేను ఏమైనా తప్పు చెప్పానా?” అని అడిగారు.

“లేదు పెరియవా! వైద్యులు నడవమన్నారు, పరమాచార్యులు ప్రదక్షిణం చెయ్యమన్నారు” అని సమాధానం ఇచ్చాడు.

“అంటే మేము ఇద్దరమూ ఇచ్చిన సూచన ‘అద్వైతం’, పేర్లు మాత్రమే ‘ద్వైతం’ అంతే.
 #కంచిపరమాచార్యవైభవం  #