flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, May 8, 2017

## ధర్మో రక్షతి రక్షితః #

ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది. 
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."
ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు. 
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు. 
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.
...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...
## ధర్మో రక్షతి రక్షితః #

                                                                         

                                                                                                                   ✿ హిమజ ✿

No comments:

Post a Comment