flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Saturday, August 4, 2018

దాన మహిమ



దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది. 


బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:

బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.

మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.

తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.

మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు

Wednesday, March 28, 2018

ధ్వజస్థంభం పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

Monday, February 26, 2018

HIMA SONGS

అలసట - ఆతిథ్యం


కర్ణాటకకు చెందిన ప్రముఖ వైద్యులు ఒకరు నాకు ఈ సంఘటనను చెప్పారు. వారు చాలా లబ్ధప్రతిష్టులు. పేదవారికి వారు చేసిన వైద్యసేవ అనన్యమైనది. ఒకసారి భార్యాపిల్లలతో కలిసి వారు ఒక రహదారి మీదుగా వెళ్తున్నారు. హఠాత్తుగా కుండపోతగా వర్షం మొదలై మొత్తం చీకటి అయిపోయింది. దారి కూడా సరిగ్గా కనపడడం లేదు. మెల్లిగా వాహనం నడుపుతూ దాదాపు రాత్రి పదకొండు గంటలప్పుడు ఒక చిన్న ఊరు చేరుకున్నారు.
దారిపక్కన ఉన్న ఒక ఇంటిలో పెద్ద వెలుగు ఉండడం గమనించారు. దారి పక్కనే కొంతమంది నిలబడి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. ఆ రాత్రి బస చేయడానికి దగ్గర్లో ఎక్కడైనా మంచి హోటలు ఉందేమో అని కనుక్కోవడానికి కారు ఆపి బయటకు దిగారు. వారిలో ఒకరు మీరు డాక్టరా? కుటుంబంతో కలిసి వచ్చారా? అని వివరాలు అడిగారు. డాక్టరు గారు అవునని చెప్పారు. దాదాపు రెండుగంటల నుండి వారికోసమే వేచియున్నట్టు చెప్పారు ఆ గ్రామస్థులు.
వారు ఆ డాక్టరుతో “ఆహారం సిద్ధంగా ఉంది. లోపలికి వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి” అని చెప్పారు. అతను చాలా అశ్చర్యపోయి, వారులో ఎవరైనా తను వైద్యం చేసిన వారు తనని గుర్తిపట్టి ఉంటారేమో అని అడిగాడు. “మీరు ముందు వచ్చి ఆహారం తీసుకోండి. పిల్లలు, మీరు కొంచం విశ్రాంతి తీసుకోండి. తరువాత మీ ప్రశ్నలన్నీటికి సమాధానం చెప్తాము” అని చెప్పారు.
అరగంట తరువాత అందరూ భోజనం చేసి కూర్చున్నారు. అప్పుడు వారు అతనితో, “పరమాచార్య స్వామివారు తమ తదుపరి మకాంకు మా ఊరిగుండా వెళ్తారని మాకు ఈ రోజు ఉదయం తెలిసింది. మేము స్వామివారు మరియు మఠం పరివారం కోసం ఆహారాన్ని సిద్ధం చేశాము. వారు ఈ ఊరికి రాగానే కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్ళవల్సిందిగా ప్రార్థించాము.
కాని వారు వర్షం మొదలవ్వక ముందే తదుపరి మకాం చేరిపోవాలని చెప్పారు. మరలా పరమాచార్య స్వామివారు రాత్రికి ఒక డాక్టరు తన కుటుంబంతో సహా ఈ దారిలో వస్తారని వారు చాలా అలసిపోయి ఉంటారు కనుక వారికి భోజనము విశ్రాంతికి వసతి ఏర్పాటు చెయ్యాలని అనుజ్ఞ ఇచ్చారు. మీరు ఎప్పుడు వస్తారా అని రెండు గంటల నుండి ఎదురుచూస్తున్నాము” అని చెప్పారు.
ఈ డాక్టరు ఇదివరకెప్పుడు మహాస్వామిని చూడలేదు. ఈ సంఘటన తరువాత అతను కంచి శ్రీమఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాడు. తరువాత అతను స్వామివారికి పెద్ద భక్తుడయ్యాడు.
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై.
KanchiParamacharyaVaibhavam కంచిపరమాచార్యవైభవం సేకరణ: