దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది.
బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:
బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.
మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.
తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.
మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు
No comments:
Post a Comment