flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, February 24, 2014

పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు...

పూవులేరి తేవేచెలి.. అని ఎంత సుందరంగా రచించారు మన దేవులపల్లి వారు.

ఫిబ్రవరి 24, 1980 తారీకున సుమధుర భావ వీచికలను తెలుగు నేల నలుచెరగులా ప్రసరింపచేసిన ఆంద్ర షెల్లీ దివిగేగిన రోజు .
అసలు కృష్ణశాస్త్రి గారు నిజంగా స్వర్గవాసి అయ్యారా అని చాలా రోజులు సందేహం తో గడిపిన జ్ఞాపకం కూడా ఉంది. ఐతే, పాంచభౌతిక జీవులకు శారీరకంగా అది తప్పదు కదా ఎప్పటికైనా అని  సంబాళించు కున్న తరుణం కూడా ఉంది.
దిగిరాను దివినుండి భువికి అని భీష్మించు కోకండి కృష్ణశాస్త్రి గారూ, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండండి అని ఆక్రోశించిన క్షణాలూ ఉన్నాయి.
'ఏలొకో యెప్పుడో యెటులనో గాని
మాయ మయ్యెద నేను మారిపోయెదను' అని అసలు ఎందుకన్నారు మీరు అని ఆయనపై నిష్టూరాలాడిన సందర్భమూ ఉంది. అయినా మీకేం లెండి, 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు' అంటూ పాడేసిన స్వేచ్ఛాగానప్రియులు మీరు, మా మాట వింటారా మీరు అని విసుక్కున్నది కూడా ఉంది.
కృష్ణ పక్షము, ప్రవాసము,ఊర్వశి తో మొదలు పెట్టి ఆయన వచన రచనలూ,రేడియో రూపకాలూ,వ్యాసావ ళీ, సినిమా పాటల సంకలనాలూ (మేఘమాల మొ.) అన్నీ చదివితే కాని ఆ రోజుల్లో ప్రాణం కుదుట పడలేదు. మల్లీశ్వరి లో "కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని, వానజల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగా బావ మ్రోల"; 'గడియ యేని ఇక విడిచిపోకుమా, ఎగసిన హృదయము పగుల నీకుమా" అనే లైనులు ఎన్నిసార్లు తలచుకుని రసానందాన్ని పొందానో లెక్కే లేదు.
" నల్లమబ్బుల నింగి నా సౌధ రాజమ్ము
నల్లమబ్బే ప్రియుడు, నన్ను కొరకుమా !"
ఆడుచును బాడుచును హాయిగా నవ్వుచును
పాడు మేఘాలతో పరుగెత్తె మెరపు! -- అంటూ చిన్ని చిన్ని పదాలతో మనోహరంగా చెప్పే తీరు యెంత ఆకట్టుకున్నదో !
'నీలాభ్ర సరసిలో నిండు జాబిల్లి
రాయంచ వలె విహారము సలిపె' అన్నా,

'నా విరుల తోట లో పెంచికొన్నాడ నొక్క
పవడపు గులాబి మొక్క నా ప్రణయ జీవ
నమ్ము వర్షమ్ము గా ననయమ్ము కురిసి ...
ఎట్టులది దాపురించెనొ ఏమొ యంత
నాకుసందుల త్రోవల నల్ల దిగియె
నొక్క క్రూరార్క కిరణమ్ము; ఉర్వి వాలి
నా గులాబి సోలి తూలి నన్ను వీడె.
అపుడు నావైపు చూచి, నా యలరు లేని
శూన్యమౌ మ్రోడు మ్రాకును జూచి, యొక్క
కోకిలమ్ము కో యని యేడ్చే గొంతు నెత్తి!
మా కొరకు దారి బోయెడు మందపవను
డొకడు జాలిగ నొక్క నిట్టూర్పు విసరె! ' అన్నా కృష్ణ శాస్త్రి గారికే చెల్లింది.
ప్రతి భావానికీ సరిగ్గా తగిన పదం ఉంటుంది, దాన్ని వెతకాలి, పట్టుకోవాలి, అప్పుడే అది కవిత్వం అవుతుంది అని ఆయన అనేవారు. ఆ మాట ఆయన పట్ల అక్షర సత్యం.
ఆ కవికుల చక్రవర్తికి నా నమస్సులు.

No comments:

Post a Comment